మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు బోండా ఉమకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లు పంపి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించారు. అప్పటికే వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు తెలుగు మహిళలను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసనకు దిగారు. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా అనిత ప్రశ్నించారు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు తమకు ఉందని చెప్పారు. తమను కార్యాలయంలోకి అనుమతించకపోతే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మనే బయటకు రావాలని డిమాండ్ చేశారు.
మహిళలపై నేరాలకు సంబంధించి వినతిపత్రం అందజేసి వెళ్లిపోతామని తెలుగు మహిళలు చెప్పారు. దీంతో కొందరు మహిళలను కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. వారు వాసిరెడ్డి పద్మకు వినతి పత్రం అందజేశారు. విజయవాడ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మృగాళ్లతో పాటు అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ‘సీఎం జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. ఇలాంటి ఆరోపణలు సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు అనిత. దీంతో ఆ పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ అన్నారు.