ఓవైపు భారీగా పెరుగుతున్న డీజిల్ ఖర్చులు, మరోవైపు పాతబడుతున్న బస్సులు ఇవన్నింటికి తోడు కరోనా కష్టాలు, అప్పుల బాధ వెరసీ ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయటం తప్పదు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీని లాభాల దిశలో నడపొచ్చని ఎంతో మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త వచ్చి ఎంపీ ఐపీఎస్ సజ్జనార్ పై ఇప్పుడు ఆర్టీసీ భారం పడింది. అయితే, ప్రభుత్వాధినేతలు ఒకలా ఉంటే తాము మరొలా ఉంటామనుకున్నారో ఏమో… ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ బస్ భవన్ కు వాస్తు మార్పులు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే బస్ భవన్ మెయిన్ గేట్ ను ఉపయోగించటం మానేశారు. సంధ్య థియేటర్ వైపు ఉన్న గేటును కాకుండా… వెనుక నుండి ఉన్న చిన్న గేటును వాడుతున్నారు. ఇది ఉత్తర దిశగా ఉండగా, సంధ్య థియేటర్ వైపు ఉన్న గేటు దక్షిణం దిశగా ఉంది. దీంతో ఉత్తరం గేటు వాడాలని… దక్షిణం గేటును వాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ సజ్జనార్ సైతం ఉత్తరం గేటు నుండే వచ్చారని, చిన్నగా ఉన్నా అదే గేటును వాడుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మార్పులు సజ్జనార్ సూచించినవి కాదని, గతంలోనే అధికారుల స్థాయిలో అనుకున్నా… ఇప్పుడు అమలు చేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులంటున్నారు.