బాలకృష్ణ హీరోగా .. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ . మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వేదికను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసారు.
ఒంగోలులోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో, ఈ నెల 6వ తేదీన ఈ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ మేరకు ఈవెంట్ ఆర్గనైజర్లు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎదురు దెబ్బ తగిలింది.
ఆ ప్రాంగణంలో వేడుక నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఫర్మిషన్ కి నిరాకరించారు. ఊహించినదానికంటే అధిక సంఖ్యలో అభిమానులు తరలివస్తారని, నగరంలో కాబట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని చిత్ర టీమ్ కి సూచించారు. ‘వీరసింహారెడ్డి’ టీమ్ బి.ఎం.ఆర్. ఇన్‌ఫ్రా ప్రాంగణాన్ని సందర్శించింది. మరి, వేడుకను అక్కడే నిర్వహిస్తారా? మరో చోట? అన్నది తెలియాల్సి ఉంది.
ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అటు ఈనెల 8న విశాఖలో జరగాల్సిన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ అలరించనున్న ఈ సినిమాలో, విలన్ గా దునియా విజయ్ కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.