హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయల ధరైనా కిలోకి తక్కువలో తక్కువ రూ.40 నుంచి రూ.60 ఉంటున్నాయి. అందులోనూ బీన్స్ ధర వింటే బాబోయే అనాల్సిందే. బీన్స్ కిలో రూ.100లు పలుకుతోంది. దీంతో ప్రజలు బీన్స్ దరిదాపుల్లోకే వెళ్లడం లేదు.
అకాల వర్షాలు , అధిక ఉష్ణోగ్రతలు, కూరగాయల కొరత, దానికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానల కారణంగా మామిడికాయల రాక తగ్గడంతో మామిడి పండ్ల ధరలు కూడా పెరిగాయి.
ఊరగాయల తయారీలో ఉపయోగించే నాటు రకం పచ్చి మామిడికాయలు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.12 వరకు విక్రయిస్తున్నారు. గతేడాది రూ.5 చొప్పున విక్రయించామని వ్యాపారులే చెబుతున్నారు. అటు నిమ్మకాయలకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది మార్చిలో నిమ్మకాయలు ఒక్కొక్కటి రూ.3కు విక్రయించగా ప్రస్తుతం రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు.
పచ్చిమిర్చి, బంగాళదుంపలు కిలోకు రూ.40 నుంచి రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక టమాటా మాత్రం కాస్త చవకగా దొరుకుతోంది. కిలో రూ.15 నుండి రూ.20 వరకు పలుకుతోంది. పెరిగిన ధరలు రైతులకు మేలు చేసిన కొనుక్కునే ప్రజలు మాత్రం ధరలను చూసి భయపడిపోతున్నారు.