దేశ వ్యాప్తంగా పడుతున్న వర్షాల వల్ల వ్యాపారస్థులు చాలా మంది తీవ్రస్థాయిలో నష్టపోయారనే చెప్పవచ్చు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారం చేసేవారు.. వారి వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోక..అవి నిల్వ ఉండక వాటిని ఏం చేసుకోవాలో తెలియక మదన పడుతున్నారు.
ముసుర్లు పడుతుండటంతో కనీసం తోటలోని కూరగాయలు కోసేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో నగర మార్కెట్లకు వచ్చే కూరగాయల పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే సప్లయి తగ్గి రేట్లు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి.
వర్షాల వల్ల మార్కెట్ లోకి ప్రతిరోజు వచ్చే కూరగాయల కంటే దాదాపు 40 శాతం తక్కువగా వస్తున్నాయని తోటలు, పొలాల్లో పంటలన్నీ నీట మునిగాయని కనీసం వాటిని కోసేందుకు కూలీలు కూడా రావట్లేదని అధికారులు పేర్కొన్నారు.
కావున హైదరాబాద్‌లలోని రైతు బజార్లకు వచ్చే కూరగాయల సప్లయ్ తగ్గుతోందని అధికారులు వెల్లడించారు. అయితే రైతు బజార్లకు కూరగాయలు కొనేందుకు జనాలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ మార్కెట్ వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూరగాయలను తీసుకుని మార్కెట్ కు వస్తుంటే ఎవరు కూడా కొనడానికి రావట్లేదని అందువల్ల కూరగాయలు కుళ్లిపోతున్నాయని వాపోతున్నారు.
కనీసం ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కూడా రావట్లేదని, వర్షాల వల్ల రైతు బజార్లు ఖాళీగా కనిపిస్తున్నాయని రైతులు తెలిపారు.