రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు రగిలిపోతున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఘాటైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తని… సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటని ప్రశ్నించారు. తమపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.
ఫాంహౌస్ లో కూర్చుని పేకాట ఆడడానికి తప్ప పవన్ దేనికీ పనికిరారని మండిపడ్డారు వెల్లంపల్లి. అసలు చిరంజీవి లేకపోతే ఆయన జీరో అని అన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల తరఫున డైలాగులు చెప్తారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట కూడా గెలవలేక పోయారని సెటైర్లు వేశారు. జనసేనకు విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా దక్కలేదన్న వెల్లంపల్లి… ఏపీలో పవన్ కు చోటు లేదని తెలిసిపోయిందన్నారు.