ప్రధాని మోడీ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు ప్రధాని మోడీ అని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని అని అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్నాడని మండిపడ్డారు. 5జీ స్పెక్ట్రం వేలంలో 15 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.
ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3లక్షల కోట్ల కుంభ కోణం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. కేసిఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని దళిత బంధు, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, రైతుబంధు, తదితర పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు.
దేశంలోనే అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రారంభించడానికి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సమాయత్తమయ్యారన్నారు.