వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన తరఫున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రెటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రెటరీ కేంద్రం ఇచ్చిందని కోర్టుకు వెల్లడించారు. ఇది చట్ట విరుద్ధమని వాదించారు. సెక్షన్ 10,(2) ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పౌరసత్వం రద్దు చేసే అధికారాలున్నాయని తెలిపారు. కానీ.. పిటిషనర్ కు అందులో ఉన్న ఏ అంశాలు కూడా వర్తించవని.. చెన్నమనేని టెర్రరిస్ట్, సంఘ విద్రోహ శక్తి కాదని.. సెక్షన్ 10(2) వర్తించదని కోర్టుకు వివరించారు వెంకటరమణ.
ఓవర్ సీస్ ఇండియన్ సిటిజన్ కు దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అధికారం ఉంటుందా..? అని ప్రశ్నించింది హైకోర్టు. ఓసీఐ మీద ఎలాంటి పోటీ చేసే అధికారం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రవి కిరణ్ రావు పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన వెంకటరమణ.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చెన్నమనేని గెలిచారని కోర్టుకు తెలిపారు. అయితే ఆ నాలుగు సార్లు దురదృష్టవశాత్తు జర్మనీ పాస్ పోర్ట్ మీదే గెలిచారని న్యాయవాది రవి కిరణ్ రావు వివరించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.