ప్రముఖ పర్యాటక నగరం ఇటలీలోని వెనిస్ ఓ సంచలన ప్రకటన చేసింది. తమ నగరంలోకి ప్రవేశించాలంటే ఫీజు కట్టాలనే నిబంధన విధించిన తొలి నగరంగా రికార్డుల్లో కెక్కింది. ఇకపై వెనిస్ లో ప్రవేశించాలనుకునే వాళ్లు కనీసం రూ.247 నుంచి రూ. 823 దాకా చెల్లించాల్సి ఉంటుంది.
వెనిస్ చేరుకోవాలనుకునే పర్యాటకులు ముందుగానే ఆన్ లైన్ లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్ లైన్ లోనే ప్రవేశ రుసుము చెల్లిస్తేనే ఆ నగరంలోకి వెళ్లాలి. అలా కాదని నేరుగా వెళ్లారనుకోండి..ఏం జరుగుతుందో తెలుసా..? ఇక్కడా పెద్ద ఫిట్టింగే పెట్టింది ఇటలీ సర్కార్. ప్రవేశ రుసుము చెల్లించకుండా ఎంటరైతే దానిని అక్రమ ప్రవేశం కిందే భావించి కనీసం రూ. 4,116 నుంచి రూ. 24, 701 దాకా జరిమానా విధిస్తారు.
ఇంతకీ ఇదంతా ఎందుకంటే తమ నగరానికి పెరుగుతున్నపర్యాటకుల రద్దీని తట్టుకోవటం ఒక కారణమైతే, ప్రవేశ రుసుముగా వచ్చే మొత్తంతో నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దటం. దీనిని ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణించారు వెనిస్ టూరిజం చీఫ్ సైమోన్ వెంటూరిని. ఈ రుసుము నగరానికి కావాల్సిన మెయింటెనెన్స్ ను అందించటమే గాకుండా.. కాస్త అతిగా మారిన పర్యాటకాన్ని కూడా తగ్గిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారాయన. ఎందుకంటే గత కొన్నేళ్లుగా నిత్యం పర్యాటకులు కిటకిటలాడుతుండటంతో స్థానికుల మనుగడ కష్టంగా మారిందన్నారు.
అటు కొవిడ్ తర్వాత తొలిసారి లగూన్ నగరంలో సైతం పర్యాటకులు భారీగా కనిపిస్తున్నారట. ఈ సంఖ్య కనీసం 50 వేలకు తగ్గటం లేదని టూరిజం అధికారులు చెప్తున్నారు.
ఇక వెనిస్ ఎంట్రీ రుసుములో హెచ్చు తగ్గులపై కూడా వివరణ ఇచ్చారు. ఆన్ లైన్ లో పర్యాటకులు నమోదు చేసుకుంటున్న రద్దీని బట్టి ఎంట్రీ ఫీజు ఎంత అనేది నిర్ధారిస్తారు. అంటే ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే ఫీజును పెంచేస్తారన్నమాట. మొత్తానికి ప్రపంచంలోనే తొలిసారి ఒక నగరానికే ఎంట్రీ ఫీజు పెట్టిన ఘనత కూడా తమకే దక్కిందని సంబరపడుతున్నారు వెనిస్ టూరిజం అధికారులు.