ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వీరులెందరో. వారిలో వెనిగండ్ల నర్సింహారావు(వీఎన్ రావు) ఒకరు. సమైక్య పాలకుల దోపిడీ విధానాలను ఎండగడుతూ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు కోసం 1969 ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూనే పోరాటం సాగించారు. ఆ విప్లవ నిప్పు కణిక తుది శ్వాస విడిచింది.
నర్సింహారావు మృతిపై తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక విచారం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించింది. మలిదశ తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన, తెలంగాణ విఠల్ ఈయన కుమారుడే. నర్సింహారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేవరకు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు నర్సింహారావు. ఖమ్మం జిల్లాలో మంచి పేరు సంపాదించారు. రూరల్ మండలం పెద్ద తండా దగ్గర ఆయన మనవడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పొనుగోటి సంపత్ ఇంటిలో తుది శ్వాస విడిచారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక సభ్యులు ఉద్యమ జోహార్లు అర్పించారు. ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ విఠల్ ని కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.