ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీలో వెంకయ్య నాయుడుతో ఆయన నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు సుమారు గంట పాటు సమావేశమయ్యారు.
రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవంపై విపక్షాలతో చర్చించే బాధ్యతను జేపీ నడ్డా, రాజ్నాథ్లకు బీజేపీ అప్పగించింది. ఇక ఈ ఎన్నికల కోసం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల నేతృత్వంలో ఓ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది.
ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పలువురి పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో వెంకయ్యనాయుడుతో బీజేపీ సీనియర్ల భేటి అయ్యారు. దీంతో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.