రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తోంది. అయితే.. అంతకంటే ముందే ఆ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటోంది. తర్వాతి రాష్ట్రపతి ఎవరా అనే చర్చ జరుగుతూ తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి. శరద్ పవార్, ఆజాద్, మాయావతి.. ఇలా అనేక పేర్లు వినిపించాయి. అయితే.. తాజాగా వినిపిస్తున్న పేరు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దీనికి ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర కీలక నేతలు అందరూ హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపైనే వార మధ్య కీలక చర్చ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఈసారి తమ పార్టీ తరఫున వెంకయ్య నాయుడును నిలబెట్టాలనే విషయంపై చర్చించినట్లుగా సమాచారం. దీనిపై పార్లమెంటరీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై స్పందించారు వెంకయ్య. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ వదంతులేనని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు వెంకయ్య. ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారని మీడియాలో వర్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్పష్టత ఇచ్చారు.