వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసి పోయింది. గోవింద నామస్మరణతో మార్మోగింది. పది రోజుల పాటు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనాన్ని టీటీడీ ఏర్పాటు చేసినప్పటికీ.. వైకుంఠ ఏకాదశి రోజే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది.
ఎప్పుడూ లేని విధంగా ఒక్క రోజే 7.68 కోట్ల కానుకలను భక్తులు తిరుమలేశ్వరునికి సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. ఓకే రోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2022 అక్టోబర్ 23 న వచ్చిన 6.31 కోట్ల ఆదాయమే ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక హుండీ ఆదాయం.
ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం శ్రీవారిని 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే తిరుమలలో ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుండడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశముంది. ఈ నెల 28 న శ్రీవారి రథసప్తమి వేడుక కూడా వైభవంగా జరగనుంది. దీంతో ఒకే రోజున శ్రీవారు తిరుమల మాడవీధుల్లో సప్తవాహనాలపై ఊరేగనున్నారు.
అప్పుడు కూడా భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చే అవకాశముంది. మొత్తానికి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన మర్నాడే..శ్రీవారికి కానుకల వర్షం కురియడం విశేషం. అయితే వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక టికెట్లను ఈ సారి టీటీడీ విడుదల చేయడంతో.. ఈ పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముంది. దీంతో స్వామి వారి హుండీకి ఆదాయం కూడా భారీగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది.