రాష్ట్రంలో ప్రోటోకాల్ పంచాయితీ రోజురోజుకు పెరుగిపోతోంది. టీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ విషయాన్ని మరిచి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలపడుతున్నాయి. రాజకీయ కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానిస్తున్నారని ఇప్పటికే పలువురు నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై భగ్గున మండిపడుతున్నారు.
తాజాగా.. ఇదే విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకుపడ్డారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదన్నారు. స్థానిక ఎంపీగా ఉన్న తనను ఆలయ పిలవలేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించిందన్నారు. దేవుడు దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరంగా ఉందని చెప్పారు వెంకట్ రెడ్డి.
తనకు ఆహ్వానం వస్తుందని పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ.. హైదరాబాద్ కు వచ్చి ఎదురు చూస్తున్నానని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ ను సైతం గౌరవించని తుగ్లక్ పాలనను తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తుంటే ఆయన పక్కనున్న ఎమ్మెల్యేలు సిపాయిలుగా పనిచేస్తున్నారని విమర్శించారు.
ఇటీవల రాష్ట్ర గవర్నర్ తమిళిసై నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతం చెంచుపెంటలో పర్యటించారు. గవర్నర్ ఏ ప్రాంతంలో పర్యటించినా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాంతానికి చెందని స్థానిక నేతలు, అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. ఆరోజు ఏ ఒక్కరు కనిపించలేదు.