ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. తాను ఎవరినీ బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదనని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తనపై నిఘా పెట్టాలని డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు రక్షణ కావాలని డీజీపీని కోరతానని చెప్పారు.కరోనా వైరస్‌తో ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పే సందర్భంలోనే.. చంపుతాననే వ్యాఖ్యలు చేశానని వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు.అంతే తప్ప నిమ్మగడ్డను ఉద్దేశించినవి కావని తెలిపారు. 2 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల కోసం ఎన్నికలు వాయిదా వేయలేరా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేదే ఎస్‌ఈసీ ఉద్దేశమని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.