ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి 20 రోజుల ముందే అమెరికా వెళ్లి సందడి చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఎన్నో ప్రచార కార్యక్రమాలతో పాటు టీవీ ఇంటర్వ్యూలతో చరణ్ బిజీగా మారిపోయాడు. ఇటీవల ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ వంటి ప్రముఖ షోలో గెస్ట్ గా కనిపించాడు. లేటెస్ట్ గా తన కుటుంబ సభ్యులతో కలసి ఓ వివాహానికి హాజరయ్యాడు చెర్రీ.
సరిగ్గా అదే వివాహ కార్యక్రమానికి ప్రముఖ యాక్టర్ వెంకటేష్ కూడా విచ్చేశాడు. దీంతో ఆ పెళ్లిలో మరింత సందడి వాతావరణం నెలకొంది. స్టేజిపై చరణ్, వెంకీ మామ పక్కపక్కనే నిల్చొని హంగామా చేశారు. ఇక మైక్ తీసుకుని రామ్ చరణ్ గురించి మాట్లాడాడు వెంకటేష్.
‘మిస్టర్ చరణ్ ఇది ‘నాటు నాటు సమయం’ అన్ని అవార్డులూ రామ్ చరణ్ కే’ అని ప్రకటించారు. చరణ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. వెంకీ నుంచి మైక్ తీసుకుని థ్యాంక్స్ వెంకీ అన్నా అని చెప్పాడు. చరణ్, వెంకటేష్ స్టేజి మీద సరదాగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు, అవార్డులకు నోచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపిక కాగా, ఇదే పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలోనూ ఆస్కార్ అవార్డు నామినేషన్లలోనూ చోటు సంపాదించుకుంది.