కొన్ని తెరవెనక విశేషాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయినప్పుడు, అది కాకుండా అంతకుముందు అనుకున్న కథతో సినిమా చేస్తే బాగుంటుందని కొందరు చెబుతుంటారు. హిట్ అయితే, ఈ కథ కంటే ముందు మరో కథ అనుకున్నామని, ఆ కథతో సినిమా చేస్తే ఎలా ఉండేదో అనే అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఉదంతమే.
పాతికేళ్ల కిందటి సంగతి. జయంత్ సి.పరాన్జీ దగ్గుబాటి కాంపౌండ్ లో వర్క్ చేస్తున్నాడు. వెంకటేష్ తో ఓ సినిమా చేయాలనేది ఒప్పందం. దాని కోసం పరుచూరి బ్రదర్స్ తో కలిసి కథలు వండుతున్నాడు జయంత్. అలా ఎంతో మేధోమథనం తర్వాత వెంకటేష్ తో ఓ అడవి మనిషి కాన్సెప్ట్ లో సినిమా చేయాలని అంతా నిర్ణయించుకున్నారు.
అప్పటికే చిరంజీవి అడవి మనిషి పాత్ర పోషించాడు. వెంకటేష్ కూడా బొబ్బిలి రాజా లాంటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేశాడు. కాబట్టి మరోసారి అడవి మనిషి పాత్ర వర్కవుట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ వీళ్లు ఒకటి తలస్తే, విధి మరోటి తలచింది.
అంతా ఓకే అనుకున్న టైమ్ లో సురేష్ బాబు దగ్గరకు ఓ కథ వచ్చింది. అదే ప్రేమించుకుందాం రా. ఆ కథ సురేష్ బాబుకు నచ్చింది. కాకపోతే భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకైనా మంచిదని జయంత్ కు కథ వినిపించాడు. సురేష్ బాబు ఫీలైన మార్పుల్నే జయంత్ కూడా ఫీలయ్యారు. దీంతో సినిమా ఓకే అయింది. అలా అడవి మనిషి కాన్సెప్ట్ పక్కకెళ్లిపోయింది.
నిజానికి ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్ కు ప్రేమ లేదంట. ఇద్దరు ప్రేమికుల్ని కలిపే పాత్ర అంట. అలా చేస్తే సినిమా హిట్టవ్వదని భావించి వెంకటేష్ కు లవ్ స్టోరీ పెట్టారు. అదే సినిమాకు పెద్ద ప్లస్ అయింది.