కొన్నాళ్ల కిందటి సంగతి. వెంకటేష్ కు ఓ స్టోరీ చెప్పాడు దర్శకుడు కిషోర్ తిరుమల. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. దీంతో శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్టార్ట్ చేశాడు కిషోర్ తిరుమల. అయితే ఇక్కడే ఊహాగానాలు మొదలయ్యాయి. వెంకటేష్ కోసం అనుకున్న కథతోనే, శర్వానంద్ హీరోగా తిరుమల కిషోర్ సెట్స్ పైకి వెళ్లాడని అంతా అనుకున్నారు. ఇప్పటికీ అదే ప్రచారం నడుస్తోంది. దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
“వెంకటేష్ గారితో నేను చేయాలనుకున్న కథ వేరు, ఈ కథ వేరు. ఎందుకో ఆ సినిమా సెట్ అవ్వలేదు. త్వరలోనే కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తాను. కాకపోతే వెంకటేష్ కు చెప్పిన కథలో హీరో బ్యాక్ గ్రౌండ్, ఆడవాళ్లు మీకు జోహార్లు కథలో హీరో బ్యాక్ గ్రౌండ్ ఒకటే. ఈ రెండు సినిమాల కోసం అనుకున్న టైటిల్ కూడా ఒకటే. ఈ రెండు మాత్రమే కామన్ గా కనిపిస్తాయి. మిగతాదంతా సెపరేట్ గా రాసుకున్నదే. ఓ సందర్భంలో శర్వానంద్ కలిసి మీ దగ్గర ఓ పాయింట్ ఉందని విన్నాను. ఆ స్క్రిప్ట్ చేద్దాం అన్నాడు. వెంటనే స్క్రిప్ట్ డెవలప్ చేసి తనకి నెరేట్ చేశాను. శర్వాకి బాగా నచ్చి వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోయాం. అదే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా.”
ఈ సినిమాలో చాలామంది సీనియర్ హీరోయిన్లు ఉన్నారు. ఎక్కువమంది ఆడవాళ్ల మధ్య పెరిగిన మగాడిగా శర్వానంద్ ను చూపించడం కోసం.. ఇలా సీనియర్ హీరోయిన్లను తీసుకున్నారు. అయితే వాళ్లను కావాలని తీసుకోలేదంటున్నాడు కిషోర్ తిరుమల.
“సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆ ఆడవాళ్ళ మధ్యలో మగాడిలా ఉండే వ్యక్తి శర్వా. కథలో ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉంది. అందుకే సీనియర్లను తీసుకున్నాం. ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా ఇన్-కంప్లీట్ గా అనిపిస్తుంది. ఈ సినిమా స్క్రిప్టింగ్ లోనే రాధిక గారు , ఖుష్బు గారు, ఊర్వసి గారు ఈ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని అనుకున్నా. కథలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇవి. ఎక్స్ పీరియన్స్ నటులైతేనే పాత్రలు క్లిక్ అవుతాయి. అప్రోచ్ అయి చెప్పగానే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళ క్యారెక్టర్స్ అందరినీ ఆకట్టుకుంటారు.”
నేను శైలజ సినిమాతో కీర్తిసురేష్ కు ఎంత మంచి పేరొచ్చిందో.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో రష్మికకు అంతకంటే ఎక్కువ పేరొస్తుందని చెబుతున్నాడు కిషోర్ తిరుమల.