విక్టరీ వెంకటేశ్ లో మంచి తాత్వికుడు ఉన్నాడు. ఆయనతో ఇంటర్వ్యూకు కూర్చుంటే మీడియాకు కావాల్సినంత తత్వం బోధిస్తాడు. వివేకానంద సూక్తులు వినిపిస్తాడు. ఇదే వెంకీ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఫిలాసఫీ పక్కన పెట్టి నిండు సభలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయాడు. గతాన్ని గుర్తు చేసుకొని పొంగిపోయాడు.
ఎఫ్3కి సంబంధించి విశాఖలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు వెంకటేశ్. ఆ ఈవెంట్ లో విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మొదటి సినిమా కలియుగ పాండవులు నుంచి ఎఫ్3 వరకు చాలా సినిమాల్ని విశాఖలోనే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. ఈ క్రమంలో విశాఖ కేంద్రంగా అందుకున్న విజయాల్ని ఏకరువు పెట్టాడు.
విశాఖ తనకు ఎంతో ఇచ్చిందన్నాడు వెంకటేశ్. ఎన్నో విజయాలు, మరపురాని అనుభూతులతో పాటు.. భారీ మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా అందించిందని చెప్పుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో తనకు అత్యథికంగా మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది విశాఖ నుంచే అన్నాడు వెంకీ. మరి ఆయన ఎలా లెక్కగట్టారో ఆయనకే తెలియాలి.
ఈ సందర్భంగా తన గత సినిమాలు నారప్ప, దృశ్యం-2.. ఓటీటీకి వెళ్లడంపై మరోసారి విచారం వ్యక్తం చేశాడు వెంకటేశ్. థియేట్రికల్ సిస్టమ్ బాగుండాలని, ఇకపై తన సినిమాలన్నీ థియేటర్లలోనే వచ్చేలా జాగ్రత్త తీసుకుంటానని విశాఖ వేదికగా హామీ ఇచ్చాడు వెంకీ.