టాలీవుడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. టాలీవుడ్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డులలో సత్తా చాటింది. ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. చంద్రబోస్ ఈ పాట రాయగా.. కీరవాణి సంగీతం అందించారు. ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు పాటకు దక్కడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం అభినందనీయం. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
అటు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కినందుకు రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, సినిమాటోగ్రఫర్ ప్రేమ రక్షిత్‌కు అభినందనలు చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఆస్కార్ అవార్డును దక్కించుకోవడం ద్వారా నాటు నాటు సాంగ్ చరిత్రలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది బహుశా భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణం. తెలుగువారు దీనిని సాధించడం మరింత ప్రత్యేకమైనది’ అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.