టాలీవుడ్ డైరెక్టర్స్ ఫుల్ క్లారిటీతో స్క్రిప్ట్ రెడీ చేసి మూవీ తీస్తున్నా ఎందుకో ఏమో ఎక్కడో ఓ మూలన మైండ్‌లో చిన్న డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే ఇది కోట్లతో బిజినెస్. అదీకాకుండా ఫాన్స్, మూవీ లవర్స్ టేస్ట్ ఏమిటనే తర్జనభర్జన జరుగుతోంది. మూవీ హిట్ అయితే నిర్మాత, హీరో, డైరెక్టర్ ఖుషీ. లేదంటే అంతా డమాల్. నిర్మాతకు డబ్బు పోతుంది. హీరో ఇమేజ్ దెబ్బతింటుంది. ఇక డైరెక్టర్ కెరీర్ డౌట్ అయిపోతుంది. వెంకీమామ మూవీ డైరెక్టర్ బాబీ ఇప్పుడు అదే డౌట్‌తో రెండు క్లయిమాక్స్‌లు ప్లాన్ చేశాడు.
‘ఎఫ్2’ చిత్రంతో వినోదాల హిట్‌ను ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్యతో ‘వెంకీమామ’ మల్టీస్టారర్‌తో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. యువ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నావాయిదా పడింది. మరింత పక్కాగా రూపొందించే కసరత్తుల్లో చిత్ర బృందం ఉంది.
‘వెంకీమామ’ మూవీ క్లయిమాక్స్ ఎలా ఉండాలి ? అనే అంశంపై ముందుగా మనసు కదిలించే భావోద్వేగాలతో క్లయిమాక్స్ రెడీ చేశారట. కానీ వినోదం కోరుకునే ప్రేక్షకులు దీన్ని అంగీకరిస్తారా? లేదా? అనే సందేహం రావడంతో డైరెక్టర్ బాబీ మరో క్లయిమాక్స్‌ను కూడా హ్యాపీ ఎండింగ్‌తో సిద్ధం చేశారట. ఏదైతేనేం రెండు క్లయిమాక్సులు తీశాక ప్రొడ్యూసర్ సురేష్ బాబు జడ్జిమెంట్ ప్రకారం ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది. మొత్తం మీద ఒకటి విషాదాంతం ముగింపు కాగా మరొకటి సుఖాంతం.
ఈ సినిమాలో వెంకటేష్ మిలటరీ మేన్. చివర్లో ఆయన పాత్రకు భావోద్వేగాలతో కూడిన ఓ బరువైన ముగింపును ఇచ్చారట. యాంటీ క్లయిమాక్స్ వెంకటేష్ అభిమానులు ఎలా ఆదరిస్తారన్నది అనుమానం. అందుకే ఎందుకైనా మంచిదని వెంకీమామ పాత్రను చంపకుండా కథ సుఖాంతమయ్యేలా మరో క్లయిమాక్స్ ను రూపొందించి పెట్టుకున్నారట బాబీ. టైటిల్ ప్రకారం చూస్తే హ్యాపీ ఎండింగ్ ఉండే అవకాశమే ఉంది.