వెన్నెల సినిమాతో కమెడియన్‌గా సినీప్రయాణం మొదలెట్టిన కిశోర్, ఆ సినిమాలోని తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి వెన్నెల కిషోర్ అయిపోయాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలెట్టి, వరుసగా గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. ఒకప్పుడు హీరో ఎవరైనా సరే కామెడీ మాత్రం బ్రహ్మానందంతోనే చేయించాలి అని ఎలా అయితే దర్శక-నిర్మాతలు ఫిక్సయ్యేవారో ఇప్పుడదే స్థానంలో చెలామణీ అవుతున్నాడు కిశోర్.
మధ్యలో ఒకటి రెండు సినిమాలు హీరోగా చేసినా, తన అదృష్టమో, మన అదృష్టమో తెలీదు కానీ అవి కాస్తా డిజాస్టర్లయి కూర్చున్నాయి. దాంతో హీరో అవ్వాలనే ఆలోచన విరమించుకుని తనకు అచ్చివచ్చిన కామెడీ బాటలోనే సాగిపోతూ, చాలా మంది హీరోల కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలతో స్టార్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు కిషోర్. ఇప్పుడు ఒక అనుకోని గోల్దెన్ ఛాన్స్ తన తలుపు తట్టిందని వార్తలొస్తున్నాయి.
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు ఎంత గొప్ప విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలుసు. ఆ సినిమాలోని ఒక ముఖ్యమైన కామెడీ రోల్ కోసం దర్శకుడు కిషోర్‌కు ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పాడట. శంకర్ లాంటి దర్శకుడి సినిమాల్లో చిన్నపాత్ర అయినా సరే నటించాలని ఎందరో నటీనటులు కలలు కంటూ ఉంటారు. అలాంటిది శంకర్ స్వయంగా ఫోన్ చేసి అడిగితే కిషోర్ ఎగిరి గంతేశాడట. అధికారికంగా మాత్రం భారతీయుడు-2 టీమ్ నుంచి కానీ, వెన్నెల కిశోర్ వైపు నుంచి కానీ ఇంకా సమాచారమేదీ రాలేదు.