‘నల్లబాలు.. నల్ల తాచు కింద లెక్క..’ అంటూ వెండితెరపై మనల్ని కడుపుబ్బా నవ్వించిన నవ్వుల రేడు వేణుమాధవ్ తన సినీ కెరియర్‌లో వెలుగుచీకట్లు ఎన్నోచూశాడు. సినిమా రంగానికి రోజుకో కమెడియన్ వస్తుండటంతో పాత హాస్యనటుల ప్రభావం క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఒక దశలో జబర్దస్త్ షో కమెడియన్లు వచ్చి వెండితెరను ఆక్రమించేశారు. దాంతో వేణుమాధవ్ లాంటి వారి సినీ కెరీర్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. కానీ అక్కడ కూడా సరైన అవకాశం దొరకలేదు. ఈ సమయంలోనే వేణుమాధవ్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు బయటకొచ్చాయి. అంతేకాదు కేన్సర్‌తో మృతి చెందాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మనస్తాపం చెందిన వేణుమాధవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఐనా కూడా మళ్లీ మళ్లీ అలాంటి వార్తలే రిపీట్ అయ్యేవి. దాంతో వేణుమాధవ్ బతికుండగానే నన్ను చంపేశారంటూ పలు సందర్భాలలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని మొరపెట్టుకున్నారు. అప్పుడు సంచలనం కోసం రాసిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి.