కొన్ని సినిమాలు కొందరు చేస్తే రిజల్ట్ ఎలా ఉండేదా అనే చర్చ టాలీవుడ్ లో సర్వసాధారణం. ఇడియట్ సినిమాను పవన్ కల్యాణ్ చేస్తే బాగుండేదని అతడి ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు. ఇలా ప్రతి హీరో, హీరోయిన్ కొన్ని సినిమాల్ని వదులుకున్న సందర్భాలున్నాయి. కొంతమంది తమ కెరీర్ ను ఫణంగా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అలాంటి సంఘటనే.
మాజీ హీరో వేణు తొట్టెంపూడి హీరోగా ఇబ్బంది పడుతున్న రోజులవి. హీరోగా అతడికి సక్సెస్ రాలేదు. ఇక వస్తాదనే ఆశ కూడా లేదు. అలాంటి టైమ్ లో అతడికి ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. కానీ దాన్ని అతడు గెస్ చేయలేకపోయాడు. వద్దనుకున్నాడు. ఫలితంగా ఏకంగా కెరీర్ ను వదులుకోవాల్సి వచ్చింది. అదే అతడు సినిమా.
మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటించాడు. టాలీవుడ్ లో సోనూ సూద్ కెరీర్ ను సుస్థిరం చేసిన సినిమాల్లో అతడు కూడా ఒకటి. అలాంటి పాత్రను వేణు తొట్టెంపూడి వదులుకున్నాడు. అవును, సోనూ సూద్ పాత్ర కోసం ముందుగా వేణును అనుకున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. ఈ విషయాన్ని వేణు స్వయంగా బయటపెట్టాడు.
వేణు, త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ తమ తమ కెరీర్ స్టార్టింగ్ లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వేణు కెరీర్ డౌన్ ఫాల్ అయింది, త్రివిక్రమ్ స్టార్ డైరక్టర్ అయిపోయాడు. ఈ రెండు పరిణామాలు జరగడానికి కేంద్ర బిందువు అతడు సినిమా. ఈ సినిమాలో వేణు విలన్ గా నటించి ఉంటే, అతడి కెరీర్ మరో రకంగా ఉండేది. కానీ అతడు చేయలేదు. ఫలితంగా కెరీర్ కోల్పోయాడు. ఇదే సినిమాతో త్రివిక్రమ్, స్టార్ డైరక్టర్ అయిపోయాడు.