కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అరె.. నిజమా అని ఆశ్చర్యమేస్తుంది. కానీ.. స్వయంగా ఆ సీన్ లో ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు నమ్మక తప్పదు. అలాంటి గమ్మత్తయిన విషయాన్నే షేర్ చేసుకున్నాడు ఒకప్పటి హీరో వేణు. లెక్కప్రకారం, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, దేశముదురు సినిమాలు తనే చేయాలనేది ఇతగాడి వాదన.
“నేను, పూరి జగన్నాథ్ చాలా క్లోజ్. నాకు చాలా కథలు చెప్పేవాడు. దర్శకుడిగా మారిన తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పాడు. ఆ కథా చర్చల్లో మొత్తం నేను ఉన్నాను. బహుశా నాతోనే ఆ సినిమా తీస్తాడేమో అనుకున్నాను. కానీ.. వెళ్లి రవితేజతో తీశాడు. ఆ తర్వాత దేశముదురు కథ చెప్పాడు. ఆ సినిమా కోసమైతే ఎన్నో రోజులు నేను-పూరి స్టోరీ డిస్కషన్స్ చేశాం. వెళ్లి బన్నీతో చేశాడు.”
ఇలా తనతో కథా చర్చలు సాగించి, వేరే హీరోలతో సినిమాలు చేశాడని పూరి జగన్నాథ్ పై విమర్శలు చేశాడు వేణు. అయితే.. ఇవన్నీ సీరియస్ విమర్శలు కాదు. సరదాగానే ఈ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో తన సినిమా కథలన్నీ పూరి జగన్నాథ్ అలా తనకు చెప్పేవాడని, తను ఫుల్ నెరేషన్ ఇప్పించుకునేవాడినని చెప్పుకొచ్చాడు.
రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇస్తున్నాడు వేణు. ఈ సినిమా ప్రమోషన్ లోనే ఈ గమ్మత్తయిన విషయాన్ని బయటపెట్టాడు.