గతం వారం రోజులుగా కురిసిన వర్షాలకు భాగ్యనగరం వణికిపోయింది. అతి తక్కువ ఉష్టోగ్రతలు నమోదవడం ఎక్కువ చలి వాతావరణం నెలకొంది. అయితే గత 54 సంవత్సరాలలో ఇంత తక్కువ ఉష్టోగ్రత నమోదవడం ఇదే మొదటిసారి. జులై 13 వ తేదీన ఉష్ణోగ్రత అత్యంత తక్కువకు పడిపోయింది. 1968 జులైలో ఒక రోజు 18.6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డవగా ఇప్పటివరకు అదే తక్కువ ఉష్ణోగ్రతగా నిలిచింది. ఈ వారంలో కురిసిన వర్షాలకు ఈ నెల 13న ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కు తగ్గడంతో గడిచిన ఐదు దశాబ్దాల్లో సెకండ్ కొల్డెస్ట్ డే గా నమోదైంది.
అయితే ఇదే నెల 10వ తేదీన కూడా ఉష్ణోగ్రత 20.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో అది థర్డ్ కోల్డెస్ట్ డేగా ఐఎండీ పేర్కొంది. ఇండియా వాతావరణ డేటా ప్రకారం ఈ నెల 11న 21 డిగ్రీలు, 12న 20.8,14న 21.03 డిగ్రీలు, 15న 22.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. దీన్ని బట్టీ చూస్తే భాగ్య నగరం ఇటీవల ఎన్నడూలేనంత చారిత్రక చలి రోజులను అనుభవించినట్లయింది.
జూలై 9 నుంచి 5 రోజులపాటు సిటీ మీద దట్టమైన మేఘాలు కమ్ముకోవటం, అధిక వర్షం కురవటం, ముసురు దీనికి ప్రధాన కారణాలు. భాగ్యనగరానికి ప్రస్తుతం చలి నుంచి కాస్త ఉపశమనం దొరికింది. మేఘాలు తొలిగి సూర్యుడు కనిపిస్తున్నాడు. కానీ ఈ నెల 18 తర్వాత మళ్లీ వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అంటే 7 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని అర్థం.
హైదరాబాద్ తో పాటు ఉత్తర, సెంట్రల్ తెలంగాణ పరిధిలో ఉన్న 10 జిల్లాలకు ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఎల్లో అలర్ట్ కింద ఉన్న కొన్ని జిల్లాలు.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి. ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.