బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జంగారెడ్డి పార్థివదేహాన్ని నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
జంగారెడ్డి మరణం పట్ల ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం తెలియజేశారు. చందుపట్ల కుమారుడు సత్యపాల్ రెడ్డికి ఫోన్ చేసిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. తామందరికీ మార్గదర్శకుడైన జంగారెడ్డి మరణం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
జన సంఘ్ లో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన జంగారెడ్డిని నక్సల్స్ ఎన్నోసార్లు హతమారుస్తామని హెచ్చరించినా భయపడకుండా బీజేపీ బలోపేతం కోసం నిరంతరం పనిచేశారని కొనియాడారు బండి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారిసేవకు అంకితమైన గొప్ప నాయకుడని చెప్పారు. ఆయన చివర శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని గుర్తు చేశారు. జంగారెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న సంజయ్… ఆయన ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడతామని తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని చెప్పారు. రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడని కొనియాడారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడని గుర్తు చేశారు. కేంద్రం తరఫున జంగారెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జంగారెడ్డి 1967లో శాయంపేట నుండి తొలిసారి జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి. ఆనాడు పీవీ నర్సింహారావుపై భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీల పాత్ర పోషించారు.