ఎంఆర్ఎఫ్ ఎంఎంఎస్‌సీ ఎఫ్ఎంఎస్‌సీఐ జాతీయ కారు రేసింగ్‌లో విషాధం చోటు చేసుకుంది. రేసర్ కేఏ కుమార్ (59)కు చెందిన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రేసర్ కేఏ కుమార్ మరణించారు. ఇరుంగటుకొట్టైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో నిర్వహిస్తున్న కారు రేసులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేసింగ్ సమయంలో అతని కారు అదుపుతప్పి బోల్తా కొడుతూ మరో కారును ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సరిహద్దు కంచె వద్ద ఉన్న చెట్లను ఢీ కొట్టింది.
వెంటనే అతన్ని కారు నుంచి బయటకు లాగారు. అతని ప్రథమ చికిత్స అందించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన మరణించారు. ఈ క్రమంలో నిర్వాహకులు రేసును మధ్యలోనే నిలిపి వేశారు.
ఇది దురదృష్టకరమైన సంఘటన అని మీట్ చైర్మన్ విక్కీ చందోక్ అన్నారు. కుమార్ చాలా అనుభవం గల రేసర్ అని ఆయన పేర్కొన్నారు. ఓ స్నేహితునిగా, ఓ పోటీ దారునిగా కుమార్ తనకు కొన్నిదశాబ్దాలుగా తెలుసన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.