2022 సంవత్సరం సినీ పరిశ్రమకు అస్సలు కలిసి రాలేదు.. వరుస ప్రమాదాలు, వివిధ భాషలకు చెందిన ప్రముఖుల మరణాలు సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు పరిశ్రమ వర్గాల వారు. సరే కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం.. అంతా మంచే జరుగుతుందనుకుంటుండగా.. ఏడాది చివర్లో కైకాల సత్య నారాయణ, చలపతి రావు వంటి సీనియర్ నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
ప్రముఖ హాలీవుడ్ నటి జోన్ సిడ్నీ 86 ఏళ్ళ వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారనే వార్త వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది..ఇంతలోనే మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. సీనియర్ సంగీత దర్శకులు చాంద్ బాషా కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
చాంద్ బాషా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌కి స్వయానా మావగారు. చంద్రబోస్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్రా తండ్రి చాంద్ బాషాా తెలుగుతో పాటు కన్నడలోనూ సంగీత దర్శకుడిగా పని చేశారు.
‘ఖడ్గతిక్కన్న’, ‘బంగారు సంకెళ్లు’, స్నేహమేరా జీవితం’, ‘మానవుడే దేవుడు’ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. శనివారం (జనవరి 7)న హైదరాబాద్ మహాప్రస్థానంలో చాంద్ బాషా అంత్యక్రియలు జరుగనున్నాయి. చాంద్ బాషాకి నివాళి అర్పిస్తూ.. సుచిత్ర, చంద్రబోస్ దంపతులకు తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు సంతాపం తెలియజేస్తున్నారు.