ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన గానంతో మంత్ర ముగ్దులను చేసిన స్వరం మూగబోయింది. సంగీత అభిమానులను దు:ఖ సాగరంలో ముంచి వాణి జయరాం అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ రోజు ఉయదం ఆమె చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
తమిళంతో పాటు పలు భాషల్లో సంగీత ప్రియులను తన గానంతో అలరించారు. ఆమె సేవలకు మెచ్చి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. ఆమె 1945 నవంబరు 30న జన్మించారు. తమిళనాడులోని వేలూరు ఆమె స్వగ్రామం. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు.
వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఆమె జాతకాన్ని ఓ సిద్దాంతికి చూపించగా, ఆమె భవిష్యత్‌లో మధుర గాయని అవుతారని చెప్పారట. దీంతో అప్పుడే ఆమెకు కలైవాణి అని పేరు పెట్టాలని సూచించారట. ఆ మాట విని ఆమె తండ్రి నవ్వుకున్నారు.
ఐదేండ్లకే కడలూరు శ్రీనివాస అయ్యంగార్ అనే విద్వాంసుని దగ్గర సంగీతంలో ఓనమాలు దిద్దారు. ఆ తర్వాత టీ.ఆర్.బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్.ఎస్.మణి లాంటి సంగీత విద్వాంసుల శిక్షణలో సంగీతంలో ఆమె మరింత రాటు దేలారు.
ఆమెకు పదేండ్ల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశం దక్కింది. ఆ తర్వాత రేడియోలో వరుసగా నాటకాలు వేయడం, కవితలు చదవడం, పాడటం దాదాపు పదేళ్ల పాటు నిరంతరం ఓ అలవాటుగా మారిపోయింది.
క్రమక్రమంగా ఆమె మనసు సినిమా పాటల వైపు మళ్లింది. కానీ శాస్త్రీయ సంగీతమే తప్పా సినీగీతాలు పాడటమంటే ఆమె తల్లిదండ్రులు ఓ అవమానంగా భావించే వారు. అందుకే ఆమె సినిమా పాటలు వచ్చినప్పుడు రేడియో సౌండ్ తక్కువ పెట్టుకుని కంఠస్తం చేసేవారు.
ఆ తర్వాత ఎలాగైనా సినిమాల్లో పాటలు పాడాలని ఆమె నిర్ణయించుకున్నారు. వివాహ అనంతరం ఆమె భర్త ఆమెకు సపోర్టుగా నిలిచారు. దీంతో కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను ఆమె నేర్చుకున్నారు. 1969లో బాంబేలో ఆమె తొలి సారి కచేరి ఇచ్చారు. అక్కడి నుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది.
పలు సంస్థల నుంచి కచేరి చేయాలంటూ ఆమెకు ఆఫర్లు వచ్చేవి. అలా ఓ సారి కచేరి చేస్తుండగా సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ కంటపడింది వాణీజయరాం. ఆయనకు ఆమె స్వరానికి మైమరిచిపోయిన ఆయన ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. దీంతో 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం లభించింది.
ఆ చిత్రంలో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో పెద్ద హిట్ అయింది. దానికి తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత వాణీ జయరాంను ఎస్.పి.కోదండపాణి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను ఆమె పాడారు.
ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గాయనిగా చాలా బిజీ అయ్యారు. కే.బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ సినిమాలో ఆఈమె పాడిన పాటలకు గాను తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ‘శంకరాభరణం’ సినిమాలోని పాటలకు గానూ రెండోసారి, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.