ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్ను మూశారు. శనివారం ఉదయం ఆమె చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నుదుటిపై గాయం కావడంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.
వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆమె తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. తల్లిదండ్రులకు ఆమె ఐదవ సంతానం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె పాడారు.
కర్ణాటక సంగీతాన్ని ఆమె ఔపోసన పట్టారు. తన ఎనిమిదవ ఏటనే కచేరీలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముత్తు స్వామి దీక్షితార్ కీర్తనలు చక్కగా పాడేవారు. ఆమె దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
ఆమె తన గానంతో ఉత్తమ నేపథ్య గాయనిగా మూడుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. అంతేగాక పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.