రేంజర్ల రాజేష్‌ను అరెస్టు చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీహెచ్‌పీ హెచ్చరించింది. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని వీహెచ్‌పీ ఆరోపించింది. నాస్తికవాదం ముసుగులో హిందుత్వంపై దాడి జరుగుతోందని పేర్కొంది. పథకం ప్రకారమే హిందువులను అణిచి వేసే కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వం పెట్టుకుందని తెలిపింది.
సీఎం ఆదేశానుసారమే పోలీస్ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడింది. నిందితులకే మద్దతుగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలను మానుకోకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని వీహెచ్‌పీ నేతలు హెచ్చరించారు.
రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్‌ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. హిందువులను ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లమారి మల్లికార్జున్ తరగతి గదుల్లోనే మతమార్పిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను జాతి విద్రోహ శక్తులుగా తయారు చేసేందుకు ఉగ్రవాదం గురించి నూరిపోస్తున్నట్లు ఆరోపించారు. జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ పై కమ్యూనల్ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.