పాశ్చాత్య మోజులో పడి తెలుగు భాషను మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరమని చెప్పారు.
తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లిలో 100 ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి తరలించే ప్రయత్నాలు అభినందనీయమన్నారు వెంకయ్య. ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ.. అమ్మ బాషను మరవద్దని చెప్పారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
మన మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలనే సంకల్పాన్ని ముందు తరాలకు అదించే బాధ్యత తెలుగు విశవిద్యాలయంపై ఉందన్నారు ఉపరాష్ట్రపతి. ప్రతీ రాష్ట్రంలో పరిపాలన భాషగా రాష్ట్ర బాష ఉండాలని చెప్పారు. మాతృభాష కళ్లలాంటిది అయితే.. విదేశీ భాష కళ్లద్దాల్లాంటివన్నారు ఉపరాష్ట్రపతి. కళ్లుంటే కళ్లద్దాలు బాగుంటాయి.. కళ్లు లేకపోతే ఎంత ఖరీదైన అద్దాలైనా పని చేయవని చెప్పుకొచ్చారు వెంకయ్య.
ఇక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్” ప్రదర్శనను ప్రారంభించారు వెంకయ్య. ఈ కార్యక్రమంలో తెలంగాణ, హర్యానాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు చెందిన అంశాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.