వివాదాస్పద లాయర్ విక్టోరియా గౌరి మద్రాస్ హైకోర్టు జడ్జి అయ్యారు. ఆమె మంగళవారం జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదట ఈ పిటిషన్ ని సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్ తో కూడిన బెంచ్ విచారించింది. లాయర్ గా ఉన్న సమయంలో గౌరి… ముస్లిములు, క్రైస్తవులకు వ్యతిరేకంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆమె బీజేపీ అనుకూలురాలని మద్రాస్ హైకోర్టుకు చెందిన 21 మంది లాయర్లు ఆరోపించారు.
మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెను నియమిస్తూ కొల్లీజియం చేసిన సిఫారసును రీకాల్ చేయాలంటూ వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఆ ఫైలును తిప్పిపంపాలని వారు అభ్యర్థించారు.
విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ఈమెను ఇంతటి ఉన్నత స్థానానికి ప్రమోట్ చేయడం తగదన్నారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీన్ని కోర్టు కొట్టివేసింది.
దీన్ని నిరసిస్తూ మద్రాస్ హైకోర్టు లాయర్లు చెన్నైలో ప్రదర్శనలు నిర్వహించారు. తమ పిటిషన్ లోని అంశాలను సుప్రీంకోర్టు లోతుగా పరిశీలించలేదని వారు అభిప్రాయపడ్డారు. జడ్జి పదవికి గౌరి అనర్హురాలని, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆమెను న్యాయమూర్తి పదవికి ఎలా ఎంపిక చేస్తారని వారు ప్రశ్నించారు. తొలుత గౌరి ప్రమాణ స్వీకారానికి ముందు కోర్టులో కొంతసేపు హైడ్రామా నడిచింది.