ఇంగ్లాండ్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించారు. దాన్ని నిర్వీర్యం చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. నార్ ఫోల్క్ కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. కేవలం ఇది హఠాత్తుగా జరిగిన ఘటనగా పోలీసులు వెల్లడించారు.
సాధారణంగా పాత కాలం నాటి బాంబులను గుర్తించినప్పుడు వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా వీలు కానీ సందర్భంలో దాన్ని పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పేల్చి వేస్తారు. నార్ ఫోల్క్ కౌంటీలో దొరికిన బాంబు విషయంలోనూ ఇదే జరిగింది.
గ్రేట్ యార్మాత్ టౌన్ ప్రాంతంలో పాత కాలం నాటి బాంబును గుర్తించారు. దీంతో దీన్ని పేల్చి వేసేందుకు గాను ఆ ప్రాంతంలో జనాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ట్రాఫిక్ ను మళ్లించి రోబోలతో బాంబును డిఫ్యూజ్ చేయించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో బాంబు పేలిపోయిందని పోలీసులు తెలిపారు. దీంతో భారీ విస్పోటనం జరిగిందని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నందు వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలిపారు. ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు.
చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు తిరిగి తమ ఇండ్లకు వెళ్లవచ్చని ట్విట్టర్ ద్వారా పోలీసులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ సమయంలో భారీగా దుమ్ము, ధూళి గాలిలోకి ఎగిసిపడింది. ఆ ప్రాంతమంతా కొద్దిసేపు పొగతో నిండిపోయింది. బాంబును డిఫ్యూజ్ చేసే ప్రక్రియను డ్రోన్ కెమెరాలో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.