ముంబై-జైనగర్ రైలులో ఓ ప్రయాణికుడిపై టికెట్ కలెక్టర్లు దాడి చేశారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడంటూ ఆ ప్రయాణికుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. పైబెర్తులో ఉన్న ఆ వ్యక్తిని కిందకు దించి మరి అతనిపై విచక్షణారహితంగా చితకబాదారు. దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 2న ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీసీపై రైల్వే చర్యలకు ఉపక్రమించింది. వారిద్దరనీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం… ఓ ప్రయాణికుడి అప్పర్ బెర్త్ పై ఉన్నాడు. ఇంతలో టికెట్ల తనిఖీ కోసం టీసీలు అతని దగ్గరికి వచ్చారు.
టికెట్ విషయంలో ప్రయాణికుడికి, టీసీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతన్ని టీసీల్లో ఒకరు కాలు పట్టుకుని కిందకు లాగాడు. కానీ అతను బెర్త్ ను పట్టుుని కిందకు పడకుండా ఆగిపోయాడు. దీంతో ఇద్దరు టీసీలు ప్రయాణికుడి రెండు కాళ్లు పట్టుకుని కిందకు లాగారు.
దీంతో ఒక్క సారిగా పై నుంచి కింద పడిన ప్రయాణికుడిపై టీసీలు కాళ్లతో బలంగా తన్నాడు. అక్కడితో ఆగకుండా విచక్షణ రహితంగా అతన్ని కొట్టారు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నెటిజన్లు దాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రైల్వే శాఖ సీరియస్ అయింది. ఆ టీసీలను సస్పెండ్ చేసింది.