హైదరాబాద్, తొలివెలుగు:ఎకనామిస్ట్ వార్షిక రిపోర్ట్ ప్రకారం ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత గొప్ప నగరంగా తేలింది. ఈ నివేదికలో రష్యా దాడులకు గురైన ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చేర్చలేదు. అంతేకాకుండా రష్యా రాజధాని మాస్కో, అలాగే.. సెయింట్ పీటర్స్‌బర్గ్ ర్యాంకింగ్ లో పడిపోయాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక ప్రకారం.. కరోనా వల్ల పూర్తిగా దెబ్బ తిన్న ఆక్లాండ్ నగరం అగ్రస్థానం నుంచి 34వ స్థానానికి పడిపోయింది. దాంతో వియన్నా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2018, 2019లో వియన్నా మొదటి స్థానంలో కొనసాగింది.
అయితే.. కరోనా కారణంగా మ్యూజియంలు, రెస్టారెంట్లు మూసివేయడంతో 2021లో 12 వ స్థానానికి పడిపోయింది. మళ్లీ 2022 నివేదిక ప్రకారం తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. మంచి మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం దృష్ట్యా వియన్నా ప్రజలు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారు. అంతేకాకుండా సంస్కృతి, వినోదం వంటి అంశాలు కూడా మెండుగా ఉన్నాయి. వియన్నా తరువాత డానిష్ రాజధాని కోపెన్ హాగ్, స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఉన్నాయి. స్విస్ నగరం జెనీవా ఆరో స్థానంలో, జర్మనీకి చెందిన ఫ్రాంక్ ఫర్డ్ ఏడవ స్థానంలో, నెదర్లాండ్స్ కు చెందిన ఆమ్ స్టర్ డామ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. కాల్గరీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలవగా, వాంకోవర్ ఐదు, టొరంటో ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.
జపాన్ దేశంలోని ఒసాకా, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లు పదో స్థానాన్ని పంచుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ గతేడాదితో పోలిస్తే 23 స్థానాలు పైకి వచ్చి 19వ స్థానంలో నిలిచింది. ఇక లండన్ ప్రపంచంలో అత్యంత నివసించదగిన నగరాలలో 33వ స్థానంలో ఉంది. స్పెయిన్ కు చెందిన బార్సిలోనా, మాడ్రిడ్ వరుసగా 35, 43వ స్థానాల్లో ఉన్నాయి. ఇటలీకి చెందిన మిలన్ 49వ ర్యాంక్ లో, న్యూయార్క్ 51వ స్థానంలో, చైనా రాజధాని బీజింగ్ 71వ స్థానంలో నిలిచాయి. లెబనాన్ రాజధాని బీరుట్ 2020 పోర్ట్ పేలుడుతో నాశనమైంది. అంతేకాకుండా వికలాంగ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. వ్యాపార గమ్యస్థానాల ర్యాంకింగ్ లో దీన్ని చేర్చలేదు. యుద్ధం వల్ల పూర్తిగా దెబ్బతిన్న సిరియా రాజధాని డమాస్కస్ చాలా తక్కువ నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది.