పంజాబ్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ లోటస్ కింద బీజేపీ నేతలు హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విజిలెన్స్ ఎదుట ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చారు.
తాజాగా మరో ఏడుగురు నేతలు కూడా హార్స్ ట్రేడింగ్ పై స్పందించారు. తమను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించిన మాట వాస్తవమేనని వెల్లడించారు. బీజేపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల వాంగ్మూలాలను విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు శీతల్ అంగురల్, రామన్ అరోరాలు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. తమకు డబ్బు ఆశగా చూపి బీజేపీలో చేరాలంటూ బెదిరింపులకు గురి చేశారంటూ డీజీపీ గౌరవ్ యాదవ్‌కు ఆప్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లా ఆఫీసర్ కొన్ని వివరాలను తెలిపారు. దాని ప్రకారం… గుర్తు తెలియని వ్యక్తులపై రాష్ట్ర క్రైమ్ సెల్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసు విచారణను ప్రభుత్వం విజిలెన్స్ బ్యూరోకు బదిలీ చేసింది.
ఈ క్రమంలో విజిలెన్స్ బ్యూరో సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు సిట్ ఎవరి పేరును బహిర్గత పరచకపోవడం గమనార్హం. జలంధర్ దక్షిణ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రామన్ అరోరా వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేశారు.
ఇక ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై అటు బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నాయి. హమీలు నెరవేర్చ లేకపోవడంతో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతోనే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఫైర్ అవుతున్నారు.