స్టార్ యాక్టర్, విలక్షణ నటుడిగా పేరున్న విజయ్ సేతుపతి రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాలపై అవగాహన ఉందని.. వాటి గురించి బాగానే తెలుసని చెబుతూ.. అయినప్పటికీ తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని.. విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక తేనాంపేటలోని అరివాలయంలో ‘స్టాలిన్ 70’ పేరుతో ఒక ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేయగా, దీనిని అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ సేతుపతి కూడా ఈ ఎగ్జిబిషన్‌ను తెలకించారు.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ 70 యేళ్ళ జీవితం ఈ ఫొటోల్లో ప్రతిబింబిస్తుంది. ఆయన వారసత్వంతో ముఖ్యమంత్రి కాలేదు. కఠోర శ్రమతో సీఎం పదవిని చేపట్టారు. ఇప్పటి యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలి. నా వరకు వస్తే నాకు రాజకీయాల గురించి ప్రతీది తెలుసు. కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే నాకిప్పుడు లేదు.
భవిష్యత్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. ఇప్పుడాయన మాటలు కోలీవుడ్ లో హాట్ హాట్ చర్చలకు తావిస్తున్నాయి. ఇక విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన ‘విడుదలై పార్ట్ 1’ చిత్రం శుక్రవారం విడుదలైంది. సంచలన దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ చిత్రం.. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
ఈ సినిమా కాకుండా.. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఓ నాలుగైదు చిత్రాలు చేస్తున్నారు. అందులో మూడు చిత్రాలు బాలీవుడ్‌వి కావడం విశేషం. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘జవాన్’ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రను చేస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.