తెలుగులో వరుసగా ఫ్లాపులిచ్చాడు విజయ్ ఆంటోనీ. ఆ మాటకొస్తే, తమిళ్ లో కూడా అతడికి హిట్స్ లేవు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు అరడజను ఫ్లాపులిచ్చాడు. ఇలాంటి టైమ్ లో అతడి కెరీర్ కు ఆక్సిజన్ అందించింది బిచ్చగాడు-2 సినిమా. ఈ మూవీ కోసం చాలా రిస్క్ చేశాడు విజయ్ ఆంటోనీ.
కథ తనే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే తనే చూసుకున్నాడు. డైరక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ కూడా తనవే. చివరికి డబ్బులు కూడా తనే పెట్టి బిచ్చగాడు-2 సినిమా తీశాడు. అలా అన్నీ తానై తీసిన ఈ సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఇది పూర్తిగా అతడి విజయం. అతడికి మాత్రమే దక్కాల్సిన విజయం.
తెలుగులో మిక్స్ డ్ టాక్ తో రిలీజైంది బిచ్చగాడు-2 సినిమా. కానీ, తెలుగులో బిచ్చగాడు మూవీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ సీక్వెల్ కు పనిచేసింది. దీంతో ఓపెనింగ్స్ కుమ్మేసింది. రెండో రోజైన శనివారం వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ, ఆదివారం తిరిగి పుంజుకుంది. అలా 3 రోజుల్లో 9 కోట్ల 22 లక్షల రూపాయల గ్రాస్ సాధించింది ఈ సినిమా.
మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు అందించబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా పోటీలో లేదు. అది కూడా బిచ్చగాడు-2కు బాగా కలిసొచ్చింది. దీంతో ఎట్టకేలకు విజయ్ ఆంటోనీ తెలుగులో హిట్ కొట్టినట్టయింది.