హీరో విజయ్ దేవరకొండ ఈడీ ఆఫీస్ కు హాజరయ్యాడు. లైగర్ మూవీకి సంబంధించి అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం పెట్టుబడుల విషయంలో ఈడీకి ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించి ఈనెల 17న పూరీ జగన్నాథ్, ఛార్మి విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది.
సినిమాల్లో అక్రమ పెట్టుబడులు పెడుతున్నారని.. ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీ, సీబీఐకి గతంలో ఫిర్యాదు చేశారు. ‘లైగర్’ చిత్రానికి ఆమె పెట్టుబడులు పెట్టారని, బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే ప్రయత్నించారని ఆరోపించారు. పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్న కవిత.. విజయ్ దేవరకొండను, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఛార్మిని, ఇతరులను తన ఇంటికి పిలిపించుకుని వారితో చర్చలు జరిపారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పూరీ, ఛార్మికి నోటీసులు పంపారు. దీంతో ఈనెల 17న ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సినిమా ఫ్లాప్ అవడం పూరి, ఛార్మిలకు భారీ నష్టాన్నే మిగిల్చింది.
ఈడీ ఆఫీసుకు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుకదారి నుంచి పూరి, ఛార్మిలు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పలు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.