అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన పై తప్పుడు వార్తలు రాస్తోన్న వెబ్ సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై విజయ్ దేవరకొండ ఒక వీడియో విడుదల చేశారు. ఫేక్ న్యూస్‌ను, గాసిప్ వెబ్‌సైట్లను నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. తాను చేస్తోన్న సామాజిక సేవను ప్రశ్నిస్తూ, తనపై తప్పుడు వార్తలు రాసిన వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పుడు వార్తల గురించి ఆయన క్షుణ్ణంగా వివరించారు.
ఇష్టమొచ్చినట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని, అలాంటి వెబ్‌సైట్లను బహిష్కరించాలని ప్రజలకు విజయ్ పిలుపునిచ్చారు. అయితే, ఈ విషయంలో విజయ్‌కు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తోంది. విజయ్‌కు అండగా తాను ఉంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ‘‘ప్రజల ప్రేమ, గౌరవాన్ని పొందడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, కృషి, సహనం, మోహం, త్యాగం ఉంటుంది. నీ భార్యకు మంచి భర్తగా ఉండటానికి నువ్వు పనిచేస్తావు. నీ పిల్లలు కోరుకున్నట్టు సూపర్ హీరో తండ్రిగా ఉంటావు. నీ అభిమానులు కోరుకునే సూపర్ స్టార్‌గా ఉంటావు. అయితే, బయటికి తెలియని ఒక వ్యక్తి, డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమై, నిన్ను అగౌరవపరుస్తాడు. పాఠకులకు తప్పుడు వార్తలు అందిస్తాడు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాడు. ఇదంతా డబ్బు కోసమే.
అందమైన మన తెలుగు సినిమా పరిశ్రమను రక్షించాలని నేను కోరుకుంటున్నాను. నా అభిమానులను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ సర్వసాధారణం అని భావిస్తోన్న సమాజం నుంచి నా పిల్లలను రక్షించాలని కోరుకుంటున్నాను. తమపై తప్పుడు వార్తలు రాస్తూ, తమను అగౌరపరుస్తూ, సమిష్టిగా తమపై అబద్ధాలను ప్రచారం చేస్తోన్న ఈ ఫేక్ వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని పరిశ్రమను కోరుతున్నాను. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్‌సైట్స్’’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. దర్శకులు కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ.. విజయ్‌కు అండగా ఉంటామని ట్వీట్లు చేశారు.