సినిమాల ద్వారా సంపాదిస్తున్న దానిలో కొంత సామాజిక సేవకు కూడా ఉపయోగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అతను నెలకొల్పిన దేవరకొండ ఫౌండేషన్ ఓ యువ క్రీడాకారుడి కెరీర్ పురోగతికి దోహదం చేసింది. మెదక్ జిల్లా చెందిన కిక్ బాక్సర్ గణేష్ న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో పోటీపడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందులో పాల్గొనేందుకు చెల్లించాల్సిన ఫీజ్ చెల్లించలేని దీన స్థితిలో అతని కుటుంబం ఉంది. రెక్కాడితే గాని డొక్కడాని కుటుంబాలు అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలవు. కానీ గణేష్ కు మాత్రం అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పోటీపడాలని ఉంది. తనకు ఎవరైనా సహాయం చేస్తే తప్పకుండా ఛాంపియన్ షిప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయగలనని అనుకున్నాడు.
అభిమానుల ద్వారా ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తెలుసుకున్నాడు. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకుగాను కావాల్సిన 24వేల ఆర్ధిక సహాయం చేశాడు. ఈనెల 1న దేవరకొండ గోవర్ధన్ రావు క్రీడాకారుడు గణేష్ కు చెక్ అందజేశాడు. విజయ్ సహాయంతో ఢిల్లీ వెళ్లిన గణేష్ .. అక్కడ జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. విజయ్ దేవరకొండ చేసిన సహాయం మూలంగానే తాను గోల్డ్ మెడల్ సాధించానని గణేష్ చెప్పాడు.