సరైన కాజ్ కోసం ఒక్క గొంతు నినదిస్తే.. వంద స్వరాలు జత కలుస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై మొదట కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టాడు. తర్వాత దీనిపై వేసిన కాంగ్రెస్ కమిటీకి వీహెచ్ సారధ్యం తీసుకుని వెళ్లి పవన్‌కల్యాణ్‌ని కలిశాడు. పవర్‌స్టార్ ఎంటరవ్వడంతో దీని కలరే మారిపోయింది. మరో ఉత్థానం తరహాలో ఉద్యమంలా మారింది. సీన్‌లోకి దేవరకొండ విజయ్ వచ్చేశాడు. ఆ కొండను కలుషితం చేస్తే ఎట్టా.. అంటూ ఈ కొండ ఇప్పుడు ట్విట్టర్‌లో జనం గుండె తలుపు తట్టాడు.

నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు. భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యంతో కూడిన తెలంగాణ ఇస్తామా?’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ట్విటర్‌లో ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు పవర్‌స్టార్ అనౌన్స్ చేశారు.