ప్రిన్స్, బన్నీలతో విజయ్ దేవరకొండ 'బిగ్ ఫైట్'!

సమ్మర్ రిలీజుల కోసం ఇప్పటికే టాలీవుడ్ లో బిగ్ ఫైట్ షురూ అయింది. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలు ఒకదానితో ఒకటి క్లాష్ కాకుండా ఇటీవలే రాజీ కుదిరింది. కనీసం మూడు వారాల గ్యాప్ తో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు నిర్మాతలు. సదరు హీరోల ఫ్యాన్స్ కూడా వసూళ్ల తకరారు తప్పిందంటూ ఖుషీ అవుతున్నారు. కానీ.. ఇదే సీజన్లో నేను సైతం అంటూ మరో డైనమిక్ హీరో పోటీకి దిగేశాడు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ పెద్ద హీరోలతో తలపడ్డానికి స్టేజి కట్టుకుంటున్నాడు. అవును.. విజయ్ హీరోగా చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్టు మే 18న విడుదల కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.

రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2, యూవీ పిక్చర్స్‌ సంయుక్తంగా తీస్తున్న ఈ సినిమాకి ఇంకా పేరు కూడా పెట్టలేదు. స్పష్టమైన ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ఒక నల్లటి కారు బొమ్మను బైటికొదిలి.. ఇదే మావోడి సినిమా అంటూ.. ఒక మకతిక అనౌన్స్ మెంట్ తప్ప మరో క్లారిటీ ఏమీ లేని ఈ సినిమా.. ఏకంగా రిలీజ్ డేట్ ఖరారు చేయడం ద్వారా.. అదీ ఒక సెన్సేషన్ అనే కలరింగ్ ఇచ్చినట్లయింది. ఏదేమైనా.. రెండు పెద్ద బ్యానర్స్.. ఒక సునామీ లాంటి యువ హీరో కాంబోలో వస్తున్న మూవీ.. పెద్ద హీరోలకు ఎంతో కొంత చెమట పట్టించడం గ్యారంటీ! ‘భరత్ అనే నేను’- ఏప్రిల్ 20న, ‘నాపేరు సూర్య’- మే 4న రావడం ఖాయమని తెలుస్తోంది. మే 8 విజయ్ దేవరకొండ మూవీకి రిలీజ్ డేట్!ఈ లెక్కన ‘అర్జున్ రెడ్డి’తో కూడా ‘పెద్ద’ ప్రొడ్యూసర్లు కూర్చుని మాట్లాడుకోక తప్పదేమో..!