హీరో విజయ్ దేవరకొండ మరోసారి ముంబయిలో ల్యాండ్ అయ్యాడు. మొన్నటికిమొన్న ముంబయి కేంద్రంగా లైగర్ ప్రచారం మొత్తం నడిపించాడు విజయ్. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత హైదరాబాద్ వచ్చేసిన ఈ హీరో, మళ్లీ ఇన్ని నెలల తర్వాత మరోసారి ముంబయిలో అడుగుపెట్టాడు. దీంతో ఇతడిపై వరుసపెట్టి పుకార్లు ఊపందుకున్నాయి.
ముందుగా బాలీవుడ్ మీడియా విషయానికొద్దాం. విజయ్ దేవరకొండ ముంబయిలో అడుగుపెట్టిన విషయం తెలిసిన వెంటనే, రష్మికను కలిసేందుకే అతడు ముంబయి వచ్చాడని కథనాలు అల్లేసింది హిందీ మీడియా. ఎఁదుకుంటే, ప్రస్తుతం రష్మిక కూడా ముంబయిలోనే ఉంటోంది మరి.
ఇక టాలీవుడ్ మీడియా విషయానికొస్తే, మరో బాలీవుడ్ ప్రాజెక్టు కోసం చర్చించేందుకు విజయ్ దేవరకొండ ముంబయికి వెళ్లాడని, టాలీవుడ్ సైట్స్ కొన్ని రాసుకొచ్చాయి. ఓ స్టార్ డైరక్టర్ తో, కరణ్ జోహార్ నేతృత్వంలో విజయ్ దేవరకొండ కొత్త హిందీ సినిమాను ప్రకటిస్తాడని రాసుకొచ్చాయి.
కానీ ఈ రెండు వార్తల్లో నిజం లేదు. మేటర్ ఏంటంటే.. ఓ యాడ్ షూట్ లో పాల్గొనేందుకు ముంబయిలో మరోసారి ల్యాండ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ యాడ్ షూటింగ్ ముగిసిన వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాడు. అదీ సంగతి. ప్రస్తుతం ఈ హీరో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు, శివ నిర్వాణ దీనికి దర్శకుడు.