టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ 19వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్టు ఈరోజు లాంఛ్ అయింది. విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ లో ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా… ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు.
ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు. దీన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు దర్శకుడు విజయ్ దేవరకొండ. గీతగోవిందం లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. ఆ మూవీ తర్వాత ఆ స్థాయిలో వస్తున్న సినిమాగా దీన్ని చెబుతున్నాడు. లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత ఇలా చక్కటి కుటుంబ కథతో రావడం హ్యాపీగా ఉందంటున్నాడు.
నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేయబోతున్నాడు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించగా…ఈ సినిమా వారి పెయిర్ ను ఫుల్ లెంగ్త్ గా తెరపై చూపించబోతోంది. ఇక మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు విజయ్. ఇప్పుడీ బ్యానర్ లో మరోసారి నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అలెప్పీ లో మిగతా షూటింగ్ పూర్తిచేస్తారు.