రౌడీ ఏంటి.. ఫుడ్ అమ్మడమేంటీ అనుకుంటున్నారా? ఇదంతా ఒక వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వార్తండీ. ప్రముఖ టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఇప్పుడు తాజాగా పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’కు ప్రచార కర్తగా ఉండేందుకు సైన్ చేశాడు. బహుశా ఇటీవలే ఫుడ్ డెలివరీ విషయానికి సంబంధించి జొమాటోపై నెటిజన్ల మధ్యలో జరిగిన ఒక యాంటీ ప్రమోషన్ క్యాంపెయిన్ దృష్టిలో ఉంచుకుని ఒక సెలెబ్రిటీని తమ ప్రచారకర్తగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు ఆ కంపెనీ వాళ్లు. ఇందులో భాగంగానే మాంచి జోరుమీదున్న యువ నటుడు విజయ్‌తో డీల్ సెట్ చేసుకున్నారు.
ఇంతకీ ఆ డీల్ విలువ ఎంతనుకుంటున్నారు? అక్షరాలా కోటి రూపాయలని సమాచారం. దేశమంతా సరకు అమ్ముకుంటున్న సంస్థ కాబట్టి, ఆ మాత్రం వుండాలి. ఐనా, స్టార్లకు ఇది అంత పెద్ద మొత్తం కానే కాదని అంటున్నారు. ఏదేమైనా వరుసగా సినిమాలు చేస్తూ ఒకవైపు, తన సొంత అపెరల్ బ్రాండ్ ‘రౌడీ’ వేర్‌తో పాటూ కే.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్, సంగీత మొబైల్స్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా మరోవైపు… ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నాడు విజయ్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమంటే ఇదే మరి.
ఇక టాలీవుడ్ హీరోల్లో బ్రాండ్స్ ప్రచారకర్తలుగా ఉన్నవారిలో సూపర్ స్టార్ మహేశ్‌బాబుదే పైచేయి. పదికి పైగా బ్యాండ్స్‌కు మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్నారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎంటీయార్, నాగచైతన్య, నాగార్జున, వెంకటేష్, రానా, అఖిల్ వంటి హీరోలు కూడా ఈ దిశగా ఇప్పటికే అడుగులెయ్యడం జరిగింది. ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని స్పైట్ కూల్ డ్రింక్ యాడ్‌తో తొలి అడుగు వేశాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి థమ్సప్ కూల్‌డ్రింక్‌కు, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పెప్సీ డ్రింక్‌కు క్యాంపెయిన్ చేశారు.