తమిళ హీరో విజయ్ నటించిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ వారసుడు. దిల్ రాజు బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఈ సినిమా వస్తోంది. ఈ మూవీతో చాలామంది తెలుగు నటీనటులకు విజయ్ వర్కింగ్ స్టయిల్, అతడి ప్రవర్తన తెలిసొచ్చింది. అందులో ఒక నటుడు శ్రీకాంత్.
విజయ్ తో కలిసి వారసుడులో నటించాడు శ్రీకాంత్. సినిమా మొత్తం శ్రీకాంత్ ఉంటాడట. చాలా సన్నివేశాలు విజయ్ తో కలిసి నటించాడట. ఆ టైమ్ లో అతని నడవడిక చూసి చాలా ఆశ్చర్యం వేసిందంటున్నాడు ఈ సీనియర్ నటుడు.
“ఇంతకుముందు కొన్ని వేడుకల్లో కలిశాను. కలిసి పని చేయడం ఇదే తొలిసారి. విజయ్ చాలా సైలెంట్ గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. కారవాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర ఉండదు. ఒకసారి సెట్ లో అడుగు పెడితే ప్యాకప్ చెప్పినంత వరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు”
ఇలా విజయ్ ను ఆకాశానికెత్తేశాడు శ్రీకాంత్. తొలిసారి స్టార్ హీరోతో కలిసి తమిళ్ సినిమా చేయడం తన కెరీర్ కు చాలా ప్లస్ అవుతుందంటున్నాడు శ్రీకాంత్. సంక్రాంతి కానుకగా వస్తోంది వారసుడు మూవీ.