ఢిల్లీ లిక్కర్ స్కామ్ అటు తిరిగి, ఇటు తిరిగి ఢిల్లీ సీఎం. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మెడకు కూడా చిక్కుకుంది. ఈ స్కామ్ లో ఓ సీఎం కూతురితో బాటు ఇలా మరో సీఎం కూడా చిక్కుకున్నారు. ఈ మద్యం కుంభకోణంలో ఈడీ తన రెండో ఛార్జ్ షీట్ లో కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. ఈ స్కామ్ లో నిందితుడు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్-చార్జ్ అయిన విజయ్ నాయర్.. మరో నిందితుడైన సమీర్ మహేంద్రుకు, కేజ్రీవాల్ కు మధ్య ఫేస్ టైం వీడియో కాల్ ఏర్పాటు చేశారని ఈ ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. ఈ కాల్ లో కేజ్రీవాల్.. విజయ్ తన సన్నిహితుడని, అతడిని విశ్వసించవచ్చునని, అతడితో కలిసి లావాదేవీలు నిర్వహించవచ్చుననీ సూచించారట.
ఈ స్కామ్ ద్వారా అందిన 100 కోట్ల నిధుల్లో 70 లక్షలను గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వినియోగించుకున్నారని ఈడీ తెలిపింది. ఆ రాష్ట్రంలో సర్వే చేసిన టీములు, వలంటీర్లకోసమని ఈ నిధులు నిర్దేశించారని వెల్లడించింది. ఈ కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఆధ్వర్యంలోని సౌత్ గ్రూప్, ఇంకా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా కు చెందిన శరత్ చంద్రా రెడ్డి పేర్లను కూడా ప్రస్తావించారు.
ఇక అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, బినయ్ బాబు వంటి పేర్లను తిరిగి పేర్కొన్నారు, 428 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇదంతా ట్రాష్ అని అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదని, అధికారంలో ఉన్న పార్టీ కోసం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. విపక్ష ప్రభుత్వాలను కూల్చడమే ఈ సంస్థ పని అన్నారు.
ఈ కుంభకోణం ఏమిటో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదన్నారు. ఈడీ రూపొందించిన ఛార్జ్ షీట్ పూర్తిగా ‘ఫ్రిక్షన్’ (కల్పితం) అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ 5 వేల ఛార్జ్ షీట్లను పెట్టిందని, ఈ కేసులో ఎంతమందిని దోషులుగా నిర్ధారించారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులన్నీ ఫేక్ అని పేర్కొన్నారు.